Saturday, June 3, 2023
Home Stories నా పునాది సర్వేల్‌ - Sakshi Interview With Mahendar Reddy

నా పునాది సర్వేల్‌ – Sakshi Interview With Mahendar Reddy

ఆ పాఠశాలే నా జీవితాన్ని మలుపుతిప్పింది..‘సాక్షి’తో నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి

  • కరెంటు లేని గ్రామంలో పుట్టా..
  • చెట్టు కింద పాఠశాలలో ఓనమాలు నేర్చుకున్నా
  • ఏడో తరగతిలో క్లాస్‌ ఫస్ట్‌.. ఇంటర్‌లో స్టేట్‌ 8వ ర్యాంకు..
  • తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యా
  • నా కుటుంబం, గురువుల తోడ్పాటుతోనే ఈ స్థాయికి..
  • పూర్తి స్థాయిలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ దిశగా కృషి చేస్తా..

సాక్షి, హైదరాబాద్‌ : ఆ ఊరుకు పెద్దగా రోడ్డు సౌకర్యమంటూ లేదు.. అప్పటికింకా కరెంట్‌ సరఫరా రాలేదు.. ఆంజనేయస్వామి గుడి దగ్గర చెట్టు కింద ఓ బడి ఉండేది.. రాజు అనే ఒకే ఒక్క టీచర్‌ అన్ని సబ్జెక్టులు బోధించేవారు.. ఆ గ్రామంలో పుట్టి, ఈ పాఠశాలలో ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి.. ఇప్పుడు అత్యంత కీలకమైన పోలీసు శాఖకు బాస్‌గా పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. ఆ గ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపూర్‌కాగా.. ఆయన రాష్ట్ర నూతన డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి. ఆదివారం డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

సాక్షి: మీరు ఎక్కడ చదువుకున్నారు, అప్పటి పరిస్థితులేమిటి?
మహేందర్‌రెడ్డి: మా ఊరు కిష్టాపూర్‌లోనే గుడి దగ్గర చెట్టు కింద రాజు అనే టీచర్‌ దగ్గర 4వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పుడు మా ఊరికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. 5వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు మూడు కిలోమీటర్ల దూరంలోని కూసుమంచి జెడ్పీ స్కూళ్లో చదివాను. 7వ తరగతిలో క్లాస్‌ ఫస్ట్‌ వచ్చాను. అదే సమయంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ సర్వేల్‌ (చౌటుప్పల్‌) ప్రవేశపరీక్ష రాశాను. అక్కడ సీటు రావడంతో 10వ తరగతి వరకు చదివాను. నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాను. స్టేట్‌ 8వ ర్యాంకు వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ రాసి వరంగల్‌ ఆర్‌ఈసీలో చేరాను. అక్కడ కొంత రాడికల్‌ మూవ్‌మెంట్‌ వల్ల ఎప్పుడూ గొడవలయ్యేవి. కొంతకాలం పరీక్షలు వాయిదా పడటం, మళ్లీ రాయడం.. ఇలా కొనసాగింది. చివరికి ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఉస్మానియా యూనివర్సిటీ చేరుకున్నా. సర్వేల్‌లో చదువుకున్న మా సీనియర్లు బీ హాస్టల్‌లో ఉండే వారు. వారితో పాటు సివిల్స్‌ రాశాను. మొదటిసారే ఐపీఎస్‌కు ఎంపికయ్యాను.

అప్పట్లో మారుమూల ప్రాంతమైనా చదువుకోగలిగారు కదా!
చాలా మారుమూల ప్రాంతం నుంచి రావడంతో తొలుత ఇబ్బంది ఎదురైంది. అటు చదువులోనూ, ఇటు వృత్తిపరంగా సక్సెస్‌ కావడంలో సర్వేల్‌ రెసిడెన్షియల్‌ చదువే టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. సాధారణంగా 7వ తరగతిలో ఫస్ట్, సెకండ్‌ స్థానాల్లో ఉన్న విద్యార్థులకే అందులో అవకాశం వచ్చేది. టాప్‌లో నిలవడంతో నాకు సీటు వచ్చింది. నా జీవితంలో ప్రగతికి పునాది వేసింది సర్వేల్‌ విద్యాలయమే.

30 ఏళ్ల సర్వీసులో చాలా చోట్ల పనిచేశారు. ఎక్కడ బాగా సంతృప్తి అనిపించింది?ఏఎస్పీగా జగిత్యాల, గుంటూరులలో పనిచేశా. తర్వాత గోదావరిఖని ఏఎస్పీ పోస్టింగ్‌ ప్రొఫెషనల్‌గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అక్కడి నుంచి ప్రారంభించా. దాదాపు రెండేళ్ల పాటు అక్కడ పనిచేశా. నన్ను బదిలీ చేసినప్పుడు అక్కడి జనం రెండు రోజులు బంద్‌ పాటించారు. ‘మహేందర్‌రెడ్డిని ఇక్కడే కొనసాగించాల’ంటూ డిమాండ్‌ చేశారు. తర్వాత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా పనిచేశా. మావోయిస్టుల నియంత్రణ కోసం ప్రజలను అభివృద్ధివైపు, మార్పు వైపు ప్రయాణించేలా కృషి చేశాం. తర్వాత ఎస్పీగా నిజామాబాద్‌లో పనిచేశాను.

ప్రధానమంత్రి నేరుగా కర్నూలు ఎస్పీగా బదిలీ చేయించారు కదా.. నిజమేనా?
అవును.. నిజామాబాద్‌లో పనిచేస్తున్న సమయంలో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, ప్రజల్లో మార్పు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు నన్ను కర్నూలు ఎస్పీగా నియమించాలని ఆదేశించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నన్ను ఎస్పీగా నియమించారు. చాలా గర్వంగా అనిపించింది. ప్రభుత్వం మారినా అక్కడే ఏడాదికి పైగా ఎస్పీగా కొనసాగాను.

అర్ధరాత్రి అయినా ఆఫీస్‌లో ఉండి పనిచేసేవారు, అంతటి ఓపిక ఎలా వచ్చింది?
ఏ ఉద్యోగమైనా, పనైనా మనస్ఫూర్తిగా చేస్తేనే విజయం సాధిస్తాం. కష్టపడితే ఎంతటి మార్పునైనా తీసుకురాగలుగుతాం. ఈ లక్ష్యంతోనే అటు జిల్లాల్లో ఎస్పీ గా, ఇటు సైబరాబాద్‌ కమిషనర్‌గా రాత్రి ఒంటి గంట వరకు మెలకువతో ఉండి.. గూండాలు, మావోయిస్టుల లొంగుబాటు, నేర నియంత్రణ కోసం పనిచేశాను. అయితే నేను ఒక్కడినే కాదు.. నేను పనిచేసిన ప్రతిచోట నాతో పాటు ఉన్న సిబ్బంది, అధికారులు కలసి టీం వర్క్‌గా చేయడం వల్లే విజయాలు వరిస్తున్నాయి. ఎక్కడ పనిచేసినా ఆత్మ సంతృప్తి ఉంటేనే విజయాన్ని ఆస్వాదించగలుగుతాం.

విధి నిర్వహణకే ఎక్కువ సమయం కేటాయిస్తారు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందిపడలేదా?
నాకున్న పెద్ద ఆస్తి నా భార్యాపిల్లలే. నా ఓపికకు, విజయాలకు కనిపించని మెట్లు వారే. పని మొదలుపెడితే అది పూర్తయ్యేదాకా నాకు నిద్రపట్టదు. దాంతో కుటుంబానికి సమయం కేటాయించలేకపోయాను. మొదట్లో వారు ఇబ్బందిపడినా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నారు. షాపింగ్, సినిమాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు.. ఇలా ఎటైనా వాళ్లే వెళ్లి వస్తారు.

సిటీ పోలీస్‌ కమిషనర్‌గా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వైపు అడుగులు వేశారు. మూస పద్ధతిలో ఉన్న సిబ్బంది, అధికారులను మార్చడంలో పడిన ఇబ్బందులు?
ఇబ్బంది అనుకుంటే ఎంతటి కార్యమైనా మొదట్లోనే నీరుగారిపోతుంది. పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అప్పగించిన బాధ్యత అది. కొత్త రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి విస్తరిస్తుంది. అలాంటి క్రియాశీలక సమయంలో దశల వారీగా ప్రజల సహకారంతో విజయం సాధించాం. ప్రజలు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా నేరుగా నాతో అభిప్రాయాలు పంచుకున్నారు. మార్పు ఒకేసారి రాదు.. కష్టమనిపించినా ఎవరినీ నొప్పించకుండా చేయడంలో సక్సెస్‌ అయ్యాం.

మీ గ్రామానికి మీరు అందజేసిన, చేస్తున్న తోడ్పాటు?
నేను సర్వీసులోకి వచ్చాక ప్రభుత్వ సహకారం, తోటి అధికారుల నేతృత్వంలో మా ఊరితో పాటు మరో ఐదు గ్రామాలకు కరెంట్, రోడ్లు, నీటి సరఫరా, పాఠశాల భవనాలు.. వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తిచేశాం. అదేవిధంగా పాలేరు కెనాల్‌ నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా తాగు, సాగు నీరు అందించగలిగాం. అయితే అంతా ప్రభుత్వ సహకారంతో చేసిందే. నేను సొంతంగా చేసిందేమీ లేదు.

కీలకమైన పోలీస్‌ శాఖకు బాస్‌గా.. ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు?
నాపై నమ్మకంతో డీజీపీగా అవకాశం కల్పించిన సీఎంకు, ప్రభుత్వానికి ముందు గా కృతజ్ఞతలు చెబుతున్నాను. తెలంగాణ లో పుట్టి ఇదే రాష్ట్ర పోలీస్‌ శాఖ కు ఇన్‌చార్జి డీజీపీగా నియామకం కావడం చాలా గర్వంగా ఉంది. నా ఊరు, నాకు చదువు నేర్పిన గురువులు, ప్రభుత్వ పెద్దలు.. ఇలా అందరి తోడ్పాటు, నమ్మకం వల్లే ఇంతటి విజయానికి చేరువయ్యాను. సమాజాన్ని ప్రభావితం చేసే మీడియా నాకు ఇప్పటివరకు చాలా సహకరించింది. అటు ప్రభుత్వం, ఇటు మీడియా తోడ్పాటుతో రాష్ట్ర పోలీస్‌ శాఖను ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా మార్చడానికి మరింత కృషిచేస్తా. ఎంత చేసినా, ఏం చేసినా.. చివరకు ప్రజలకు నచ్చేలా, మెచ్చేలా న్యాయం చేయడమే నా లక్ష్యం

curtecy: https://www.sakshi.com/news/telangana/my-roots-are-sarvail-says-ts-dgp-mahender-reddy-951848

Most Popular

AGM 2023 on 23rd April at SVM Grand Hotel

It has been decided to conduct our AGM on 23rd April, Sunday from 10.00 AM onwards. Venue -SVM Grand...

Former Sarvail Student giving Scholarships to 10th Students

Former Sarvail Student giving Scholarships to 10th Students

Medical Camp & Career Guidance at Sarvail on 27th November

People behind the success of Medical Camp on 27th Nov 2022 The team behind the successful Medical Camp &...

Our Sarvailian brother , 80 batch Dr Venkat Reddy ( PhD in law ) advocate , High court , received the award and a...

Our Sarvailian brother , 80 batch Dr Venkat Reddy ( PhD in law ) advocate , High court , received the award...

Recent Comments